కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో భగ్గుమన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరి పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం అనా పైసా ఇవ్వకుండా రాష్ట్రాన్ని విస్మరించిందదని అన్నారు. ఎన్నికలు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రాలకు బిజెపి ప్రభుత్వం అధిక బడ్జెట్ కేటాయిస్తుందని ఆరోపించారు. బీహార్, ఢిల్లీలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రాలకే పెద్ద పీట వేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రనికి మొండి చేయి చూపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమవడం పట్ల సిగ్గుపడాలని అన్నారు. 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు చేతకానితనం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు ఒక్కసారన్న కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని అడిగిన పాపనపోలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బేషాజాలకు పోకుండా ఒక సభలో నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్రానికి పెద్దన్న పాత్ర పోషించాలని కోరారని గుర్తు చేశారు. బయ్యారం ఉక్కు కర్మగారాన్ని పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో విశాఖ స్టీల్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. పాలమూరు రంగారెడ్డికి నిధులు ఇవ్వమంటే వాళ్లు పోలవరం గురించి మాట్లాడుతారని ఆగ్రహించారు. ప్రజా ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. మహానగరాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ విశ్వ నగరంగా ముందుకు పోయే క్రమంలో కనీసం ఒక్క రూపాయి కూడా హైదరాబాద్ అభివృద్ధి కేటాయించలేదని చెప్పారు. మహిళా మంత్రిగా నిర్మల సీతారామన్ మహిళ లోకాన్ని విస్మరించిందని అన్నారు. పేదలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా బిజెపి ప్రభుత్వం అమలు చేయడం లేదని వివరించారు. మన రాష్ట్రం నుండి లక్షల కోట్లు పన్నుల రూపంలో తరలించకపోతున్నా రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ఎంపీ కేంద్రమంత్రుల వైఫల్యానికి నిదర్శనమే రాష్ట్రానికి నిధులు కేటాయించలేకపోవడమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాల వారికి తాము ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా ప్రజా ప్రభుత్వం ఆడంబరాలకు పోవడం లేదని తెలిపారు. వాస్తవానికి దగ్గరగా ప్రజా ప్రభుత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. కేంద్రాన్ని సహకరించాలని ఎన్నిసార్లు కోరిన పట్టించుకోవడం లేదని తెలిపారు. బిజెపి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో పతనం తప్పదని హెచ్చరించారు. బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

Post a Comment

Previous Post Next Post