తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై క్లారిటి.. ఆ భేటీ తర్వాత తుది నిర్ణయం

తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు

తర్వలో ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల నివేదిక

కేబినెట్ భేటీ తర్వాత తుది నిర్ణయం
తెలంగాణ గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముచ్చట్లు జోరందుకున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా? అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. నాయకులు గ్రామాల్లోనే మకాం వేసి మంచి, చెడులతో సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఓటర్లతో మమేకమవుతున్నారు. మరికొందరైతే గ్రామానికి అది చేస్తాం.. ఇది చేస్తామని ప్రత్యేకంగా మేనిఫెస్టో సైతం రిలీజ్ చేస్తున్నారు. తమను గెలిపిస్తే.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై కీలక సమాచారం తెలియ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు కొద్దిరోజుల్లో కేబినెట్ భేటీ నిర్వహించి ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, రైతు భరోసా పథకాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించటానికి ఇదే సరైన సమయమని ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తేలాల్సి ఉంది. కోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి నివేదికను సిద్ధం చేయగా.. త్వరలోనే సర్కార్‌కు సమర్పించనుంది. నివేదికపై చర్చించేందుకు కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భేటీలో కమిషన్‌ నివేదికను ఆమోదించి.. ఆ తర్వాత హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బీసీ కమిషన్‌ నివేదికపై చర్చించి, రిజర్వేషన్లపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వ పంపించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో చర్చించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మెుత్తంగా ఫిబ్రవరి చివరి వారంలో నోటిఫికేషన్ వస్తుందని భావిస్తుండగా.. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక గతేడాది ఫిబ్రవరి 1న సర్పంచ్‌ల పదవీ కాలం ముగియగా.. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.

Post a Comment

Previous Post Next Post