సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128 వ జయంతి కార్యక్రమాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొదటగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పరాక్రమ దీవస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర పోరాటంలో సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులతో పోరాడాడని అన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రాన్ని సాధించవచ్చని నమ్మి నాకు రక్తాన్ని ఇవ్వండి - నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని పిలుపునిచ్చాడని తెలిపారు. మాతృభూమికి స్వతంత్రాన్ని తీసుకురావడం కోసం ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణాలు అర్పించైనా భారతదేశానికి స్వతంత్రం సాధించాలంటూ స్వతంత్రం పోరాటం కోసం అజాద్ హిందు ఫౌజ్ అనే ప్రత్యేకమైన సైన్యాన్ని ఏర్పాటు చేసి పోరాటం చేసిన గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని "పరాక్రమ దివస్" పాటిస్తూ నేడు భారతదేశమంత నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు దేశ భక్తిని కలిగి ఉండి, దేశ అభివృద్ధికి పాటుపడుతూ.. ప్రపంచ దేశాల యందు భారతదేశ గౌరవాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యుల దార్ణం అరుణ, కో ఆప్షన్ సభ్యులు సలీం, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూప, సెస్ డైరెక్టర్ దార్ణం లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
Tags
Sircilla news