ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పర్యటన విజయవంతం అయ్యేలా చూడాలి
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
రాజన్న సిరిసిల్ల, 17 నవంబర్ : ఈ నెల 20 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
సోమవారం సాయంత్రం లోగా హెలీప్యాడ్ సిద్ధం చేయాలని ఆర్ & బి శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. షామియానా, బారికేడింగ్ చేసి భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. సానిటేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు.
బహిరంగ సభకు వచ్చే ప్రజల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్లు సమకూర్చాలని, ఒక్కో గ్యాలరీలో మానిటరింగ్ చేసేందుకు ఒక మండల స్థాయి అధికారి ఉంటారని పేర్కొన్నారు. బహిరంగ సభ కోసం బస్సులను సమకూర్చాలని సూచించారు. వీఐపీ, డయాస్, డ్యూటీ, రిసెప్షన్, మీడియా, తదితర పాస్ లను సిద్ధం చేయాలని ఆదేశించారు.
గెస్ట్ హౌస్ లో సదుపాయాలు, శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శన ఏర్పాట్లను, భోజన వసతి, ఇతర అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసే ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. పోలీస్ శాఖ తరపున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. అంబులెన్స్, బ్లడ్, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేలా చూడాలన్నారు.
సమీక్షలో ఆర్డీఓ లు వెంకట ఉపేందర్ రెడ్డి, రాజేశ్వర్, సిరిసిల్ల డీఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి, ఆర్&బి ఈఈ బాపురెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.వసంత రావు, సీపీఓ శ్రీనివాస చారి, మున్సిపల్ కమీషనర్లు లావణ్య, అన్వేష్, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.