మండలాలు, రెవెన్యూ డివిజన్లను క్రమబద్ధీకరణ చేయాలని.. ఆ తర్వాత జిల్లాల ఏర్పాటు
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్లతో సఖ్యతగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంతా పాజిటివ్ థింకింగ్ మాత్రమే.. నో నెగెటివ్ థింకింగ్ అని చెప్పారు. తన ప్రపంచం అంతా తెలంగాణనే అని అన్నారు. వంద సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక అందించడమే తన లక్ష్యమని తెలిపారు. మండలాలు, రెవెన్యూ డివిజన్లను క్రమబద్ధీకరణ చేయాలని.. ఆ తర్వాత జిల్లాల ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా జిల్లాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు.కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌కి, ఒక్క నియోజకవర్గం ఉన్న వనపర్తిని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారని చెప్పారు. పాలమూరుపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అందుకే స్పెషల్‌గా పాలమూరు జిల్లా ఇరిగేషన్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 13 ఎంపీ సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలు ముగిశాయని... ఇక తన దృష్టి అంతా పరిపాలన పైనే అని తెలిపారు. బీఆర్ఎస్ ఎలక్షన్ ఎలా చేసిందనే దానిని బట్టి రిజల్ట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు.ఎవరి ఓట్లు నేతలు తీసుకుంటే ఎలక్షన్ అంచనా వేయొచ్చని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ 20 వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద 210 ఎంపీ సీట్లు కూడా దాటేలా లేదన్నారు. రేపటి నుంచి పరిపాలనపై పూర్తిగా దృష్టి పెడుతామన్నారు. ధాన్యం కొనుగోలు రుణమాఫీపై దృష్టి పెడతామని వివరించారు. స్కూళ్లు ఓపెన్ అవుతాయి కాబట్టి వాటిపై దృష్టి పెడుతామని అన్నారు. రుణమాఫీ కోసం ఎఫ్ఆర్బీఎం పరిధిలో లోన్ తీసుకుంటామని చెప్పారు. ఇక రాజకీయం ముగిసిందని.. రాష్ట్రంలో తన దృష్టి పూర్తిగా పరిపాలనపైనే పెడుతానని తెలిపారు. ప్రతిపక్షాలు విమర్శలు ఏం అనుకున్న తాను పట్టించుకొనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు కూడా పూర్తిగా ఇవ్వలేదని ప్రతిపక్షాలు అన్నాయని.. ఇప్పుడు రైతు బంధు నిధులు వేశాక మా క్రెడిట్ అని చెబుతున్నారని అన్నారు.
అసెంబ్లీలో చర్చ చేసి ఏదైనా నిర్ణయం తీసుకుంటామని... లేదంటే అఖిలపక్షం పెడుతామని చెప్పారు. రేషన్ షాపుల్లో నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి పంచుతామని స్పష్టం చేశారు. సామాన్యులు కొనుగోలు చేసే 9 వస్తువులు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇస్తామన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రజలకు ఇస్తామని మాటిచ్చారు. స్టేట్‌కు ఏం కావాలో వాటిని అమలు చేసేలా చూస్తామని అన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
*మెట్రో అమ్మకంపై రేవంత్ ఏం అన్నారంటే..?*
‘‘ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తాం. కరెంట్ విషయంలో కావాలనే కొందరు అధికారులు తప్పిదాలకు పాల్పడుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఒక మెకానిజం ఏర్పాటు చేశాడు. ఎన్నికల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూశారు. కొన్ని గుర్తించాం కేసులు కూడా కొన్ని నమోదయ్యాయి.ప్రభుత్వం, విద్య, వైద్యం, వ్యవసాయంపై దృష్టి పెట్టాం. రేపటి నుంచి సచివాలయానికి వెళ్తా. తడిసిన ధాన్యం విషయంలో వెంటనే చర్యలు తీసుంటాం.ఆకస్మిక తనిఖీలు కూడా ఇక నుంచి ఉంటాయి. మూసీపై కన్సల్టెన్సీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం. మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా మేధావి కాకపోవడం వల్ల మేం కన్సల్టెన్సీపై ఆధారపడుతున్నాం. మూసీని ఒక ఆదాయ వనరుగా వాడుకుంటాం. యూటీ అనేది స్టాప్ గ్యాప్ అది ముగిసిన అధ్యాయం. యూటీ అని ఎవరైనా ప్రచారం చేస్తే వాడంత తెలివి లేని వాడు ఇంకొకడు లేడు. వరంగల్‌ను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తాం.వరంగల్లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తాం. గోదావరి జలాలను హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు రెగ్యులర్ గా వచ్చేలా చేస్తాం. ఫార్మా సిటీ లను విస్తరిస్తాం. ఒకే దగ్గర అన్ని ఫార్మా కంపెనీలు ఉంటే సిటీ విడిచి పెట్టి వెళ్లాల్సి వస్తుంది.కొన్ని కొన్ని ఉంటే వాటిని మెయింటెన్ చేయొచ్చు.కుప్పలాగా ఉంటే రూల్స్ పాటించరు.మెట్రోను ఎల్ అండ్ టీ సంస్థ అమ్ముకుంటే.. మేము చేసేది ఏం ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.