తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు సవరించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూముల రేట్లు భారీగా పెరిగినప్పటికీ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా ఆదాయం మాత్రం దానికి అనుగుణంగా ఎందుకు పెరగడం లేదనే చర్చ జరిగింది. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవడమే ప్రధాన కారణమని అభిప్రాయం వ్యక్తమైంది.
 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచినప్పటికీ, ఇంకా చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని సమావేశంలో చర్చించారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి సవరించాలి కాబట్టి, దానికి అనుగుణంగా భూముల మార్కెట్ విలువ మార్చేందుకు చర్యలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎక్కడెక్కడ వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారించాలని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు, భూముల మార్కెట్ ధరలు సవరించాలని రేవంత్‌రెడ్డి వివరించారు. స్టాంపు డ్యూటీ పెంచాలా, తగ్గించాలా, ఇతర రాష్ట్రంలో ఎంత ఉందనే విషయాలను అధ్యయనం చేయాలని చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా చోట్ల ఇరుకైన అద్దె భవనాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నందున, స్థలాలు గుర్తించి అధునాతన మోడల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు.

Post a Comment

Previous Post Next Post