సిరిసిల్ల/తంగళ్లపల్లి/వేములవాడ : జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని 03- కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా అన్నారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ళ లోని పోలింగ్ కేంద్రాలను, సిరిసిల్ల జూనియర్ కాలేజీలో, వేములవాడ జెడ్పీ పాఠశాల లో ఏర్పాటు చేసిన ఈవీఎం యంత్రాల స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా మాట్లాడుతూ జిల్లాలోని సిరిసిల్ల మరియు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. అదేవిధంగా గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లుకు మౌలిక సదుపాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఓటర్లుకు ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేవిధంగా టెంట్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం మరుగుదొడ్లు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
పోలింగ్ కేంద్రాలలో ఓటర్లుకు అభ్యర్థుల గుర్తులు స్పష్టంగా కనపడే విధంగా లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వికలాంగులు, వయో వృద్ధుల కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంపులు, వీల్ ఛైర్స్ అందుబాటులో ఉంచాలని అన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు గ్రామస్థాయి నుండి ఓటర్లుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. స్ట్రాంగ్ రూము వద్ద 24/7 పోలీసు/ సీఆర్పీఎఫ్ భద్రతా దళాల పటిష్ట నిఘా ఉండాలని అన్నారు. సి సి కెమెరాలను, విజటర్స్, సిబ్బంది విధుల రిజిస్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గముల పరిధిలో లోక్ సభ ఎన్నికల నిర్వహణకై చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అబ్జర్వర్ కు క్లుప్తంగా వివరించారు. ముందుగా కలెక్టరేట్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఎం సి ఎం సి మీడియా సెంటర్ లను పరిశీలించారు.
ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ పి.గౌతమి, సిరిసిల్ల, వేములవాడ ఆ.ర్డి.ఓ.లు రమేష్, రాజేశ్వర్, డి.పి.అర్. ఓ. వి.శ్రీధర్ , తదితరులు పాల్గొన్నారు.