కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి.. మద్దతు ధర పొందాలి
శుభ్రం చేసి, తేమ శాతం సరిగా ఉండేలా చూసుకోవాలి: అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్
సిరిసిల్ల, ఏప్రిల్ 10, 2024:
రైతులు తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఒక ప్రకటనలో సూచించారు. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు, రైతులకు మద్దతు ధర అందించేందుకు ఈసారి ముందుగానే ఏప్రిల్ ఒకటో తేదీన జిల్లాలో పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్, మెప్మా ఆద్వర్యంలో మొత్తం 259 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని వెల్లడించారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2203, గ్రేడ్ బీ రకానికి రూ.2183 నిర్ణయించిదని వెల్లడించారు. రైతులు తమ ధాన్యాన్ని శుభ్రంగా తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని తెలిపారు. ఇప్పటిదాకా జిల్లాలో బుధవారం దాకా (10-4-2024) మొత్తం 78 మంది రైతుల నుంచి 559 మెట్రిక్ టన్నుల ధాన్యం రూ. 1.23 కోట్ల విలువైనది కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యం విక్రయించి, ఆన్లైన్ అయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు, మూడు రోజుల్లో డబ్బులు జమ అవుతాయని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ వెల్లడించారు. జిల్లాలోని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు ధాన్యం విక్రయించవద్దని కోరారు. కొనుగోలు కేంద్రాలు ముందుగానే ఏర్పాటు చేయడం పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.