అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం

ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి: జిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలి

గన్ని బ్యాగులు, ప్యాడీ క్లీనర్, వెయింగ్ యంత్రాలు మొదలైన మౌళిక వసతులు కల్పించాలి

నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చేలా చర్యలు

ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్

రాజన్నసిరిసిల్ల, మార్చి 26: యాసంగి 2023-24 వరి పంట కోనుగోలు నిమిత్తం ధాన్యము కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించాలని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో యాసంగీ ధాన్యం కొనుగోలు పై అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్ తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఎక్కడ ప్రజాప్రతినిధుల ఫోటోలు రాజకీయ పార్టీల గుర్తులు ప్రతిబింబించేలా ఫ్లెక్సీల ఏర్పాటు చేయరాదని కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

జిల్లాలో అదనపు కలెక్టర్ రెవెన్యూ గారి ఆదేశాల ప్రకారం అవసరమైన మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలను పంట కోతలకు అనుగుణంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఓపెన్ చేయాలని, ఎక్కడ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోకుండా చూడాలని, అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తూ రైతుల వద్ద నుంచి మద్దతు ధర పై ఎక్కడ ఇబ్బందులేకుండా కొనుగోలు ప్రక్రియ ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని అన్నారు. 

జిల్లాలో 259 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం దిగుబడి మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, ఈ ఆసంగి సీజన్లు గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాళ్ల 2 వేల 203 రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి క్వింటాళ్ల 2 వేల 183 రూపాయల మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని తెలిపారు. 

జిల్లాలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మౌళిక వసతులు, టార్ఫాలిన్లు, క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేయాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం 17 లోపు ఉండాలనే అంశాలపై రైతులకు విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సూచించారు. 

ధాన్యం కొనుగోలు నిమిత్తం అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సంబంధిత మిల్లర్లకు కేటాయించాలని, రైస్ మిల్లు వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కోత రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లర్ల వద్ద హమాలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతులు ధాన్యాన్ని తీసుకుని వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులకు సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ట్యాగింగ్ చేయాలని, ప్రణాళిక బద్ధంగా కొనుగోలు కేంద్రం వద్దకు రైతు ధాన్యం తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 

ఖరీఫ్ 2023-24 సీజన్ కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ భారత ఆహార సంస్థకు సకాలంలో డెలివరీ చేసే విధంగా రైస్ మిల్లులను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. యాసంగి 2022-23 సీజన్ కు సంబంధించి 95 వేల 416 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేశామని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్, జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా మేనేజర్ జితేంద్ర ప్రసాద్, డీఏఓ భాస్కర్, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, డీసీఓ కార్యాలయ అస్టిస్టెంట్ రిజిస్ట్రార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post