ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

సెక్టార్, పోలీస్ ఆఫీసర్స్ కు శిక్షణలో సిరిసిల్ల ఏఆర్ఓ, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి


సిరిసిల్ల, మార్చి 26, 2024: లోక్ సభ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని సిరిసిల్ల ఏఆర్ఓ ( అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్), అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆదేశించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల ఏఆర్ఓ పరిధిలోని సెక్టార్, పోలీస్ ఆఫీసర్స్ కు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం శిక్షణ ఇచ్చారు.

 ఈ సందర్భంగా సిరిసిల్ల ఏఆర్ఓ( అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్), అదనపు కలెక్టర్ పూజారి గౌతమి మాట్లాడారు. సెక్టార్, పోలీస్ ఆఫీసర్స్ తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను బీఎల్ఓ లేదా గ్రామ ప్రత్యేక అధికారులతో కలిసి వెంటనే సందర్శించాలని సూచించారు. ఆయా పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాలు పరిశీలించాలని ఆదేశించారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ప్రాంతాలను పరిశీలించాలని తెలిపారు. సంఘ విద్రోహక పనులు చేసే వ్యక్తులు ఉంటే వారి పూర్తి వివరాలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ తక్కువ నమోదైన కేంద్రాల వివరాలు తమ వద్ద ఉండాలని తెలిపారు. ఎన్నికలకు ఒక రోజు ముందు, ఎన్నికల రోజు చేపట్టాల్సిన విధులపై సిరిసిల్ల ఆర్డీఓ రమేష్ సెక్టార్ ఆఫీసర్స్ కు వివరించారు.

పోలింగ్ రోజు ఉదయం నిర్వహించే మాక్ పోలింగ్, పోలింగ్ ముగిసిన అనంతరం చేయాల్సిన పనులపై తెలిపారు. అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా, సీ విజిల్, సువిధ, ఇతర ఎన్నికల యాప్ ల వినియోగం పై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ సమావేశంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ షరీఫ్ మోహినొద్దిన్, సెక్టోరియల్ మరియు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post