దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు యుఎస్ పిసి మద్దతు.. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు

సిరిసిల్ల, 15 ఫిబ్రవరి(జన విజన్ న్యూస్): సార్వత్రిక సమ్మె, గ్రామీణ భారత్ బందుకు మద్దతుగా శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై, భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పిసి) నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని, విద్యుత్ చట్ట సవరణను రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను, అమ్మకాన్ని నిపివేయాలని, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పిసి) అధ్వర్యంలో మద్దతు తెలిపారు. కేంద్రప్రభుత్వ విధానాలతో కార్మికులు, రైతులు, సాధారణ ప్రజలతో పాటు మధ్యతరగతి ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తెలిపింది.  కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేదని,
ఏళ్ళ తరబడి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతి కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్ళలో ఆదాయపన్ను స్లాబులను సవరించలేదని, రాయితీ మొత్తాన్ని పెంచలేదని అన్నారు. అన్ని వస్తువులపై జిఎస్టీ వసూలు చేస్తూ వేతన జీవులపై ఆదాయపన్ను భారాన్ని అధికంగా మోపి, కార్పొరేట్లకు మాత్రం పన్నుల్లో రాయితీలు కల్పించారని దుయ్యబట్టారు. రైతులు, కార్మికుల సమస్యలతో పాటు ఆదాయపన్ను శ్లాబులు సవరించాలని, రాయితీ పరిమితిని పెంచాలని, సిపిఎస్, పిఎఫ్అర్డిఎ లను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించాలని, ఎన్ ఇ పి -2020 ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్, టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు పురుషోత్తం, దాసరి రవీందర్, శ్రీహరి, లక్ష్మయ్య,  సమ్మయ్య, దేవత ప్రభాకర్, నశీరుద్దీన్, సాంబయ్య, అజయ్, లింగమూర్తి, వెంకటేష్, నారాయణ, ఫాతిమా, సంధ్యారాణి, నీరజ, సరిత, రజిత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post