వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి: వడ్డెర సంఘం నాయకుల డిమాండ్

రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు కోసమే వడ్డెరలను వాడుకుంటున్నాయని అన్నారు వడ్డెర సంఘం జిల్లా నాయకులు సూర దేవరాజు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వడ్డెర సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే వడ్డేర్లను వాడుకోవడం తప్ప, వారి స్థితిగతులపై ఆలోచించే పార్టీయే లేదని ధ్వజమెత్తారు. గత 40 సంవత్సరాల నుండి వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఏ ప్రభుత్వాలు కూడా వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చలేదని అన్నారు. తెలంగాణలో వడ్డెర్లకు ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదని, ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో ఏ ఒక్క వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కూడా కార్పొరేషన్ స్థాయి పదవి గాని, ఎమ్మెల్సీ గాని ఇవ్వలేని దుస్థితిలో తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఉన్నాయని అన్నారు. వడ్డెరల పిల్లల చదువు కొరకు జిల్లాకో హాస్టల్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా.. బండ కొట్టుకుని, కూలి పని చేసుకుని జీవిస్తున్న వడ్డెరలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్టి జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. మిగతా పార్టీలు కూడా వడ్డెరలను ఎస్టి జాబితాలో చేరుస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వడ్డెరలు తగిన రీతిలో గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post