రాజన్నసిరిసిల్ల, 11 నవంబర్(జన విజన్ న్యూస్): వేములవాడ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.. ఓవైపు అధికార బిఆర్ఎస్ పార్టీ వేములవాడకు కొత్త అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడైన ఆది శ్రీనివాసును పోటీలో నిలిపింది, బిజెపి నుండి పార్టీలో కీలకంగా పనిచేస్తున్న నేతలు దరఖాస్తు చేసుకోగా, ఈటెల రాజేందర్ వర్గంగా చెప్పబడుతున్న తుల ఉమ ఒకవైపు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ మరోవైపు వేములవాడ టికెట్ కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేశారు. చివరికి టికెట్ తుల ఉమకు ఇస్తున్నట్లు బిజెపి అధిష్టానం ప్రకటన వెలువరించింది. నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రచారం కూడా ప్రారంభించింది తుల ఉమ. నామినేషన్ దాఖలుకు చివరి రోజు అనూహ్యంగా బిజెపి అధిష్టానం చెన్నమనేని వికాస్ కు బి ఫామ్ అందజేసి తుల ఉమకు షాక్ ఇచ్చింది. దీంతో అధిష్టానం తనకు సమాచారం ఇవ్వకుండానే బీఫామ్ మరొకరికి ఇచ్చారంటూ మీడియా ఎదుట తుల ఉమ కన్నీళ్ల పర్యంతమైంది. తదనంతర పరిణామాలలో శుక్రవారం పలు పార్టీల అభ్యర్థులు, నాయకులు తుల ఉమను పరామర్శించి తమ తమ పార్టీలలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా నిర్ణయం తీసుకోవాలంటూ తుల ఉమతో మంతనాలు జరిపారు. శనివారం మరో మారు ఏఐసిసి నాయకుడితో తుల ఉమ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో వేములవాడ రాజకీయాలు ఆసక్తిగా మారి తుల ఉమ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొట్టాయి. ఈ నేపద్యంలో తుల ఉమ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ఏ పార్టీలోకి వెళ్లాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని, నిరాధారమైన వార్తలు నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల తెలంగాణభవన్ వేదికగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి తుల ఉమతో రెండు గంటల పాటు మంతనాలు జరిపారు. అనంతరం నిరాశతో ఉన్న తుల ఉమతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. చర్చల అనంతరం బీఆర్ఎస్ పార్టిలో రేపు కేటీఆర్ సమక్షంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోనున్నట్లు తెలంగాణ భవన్ నుంచి సమాచారం అందింది. ఈ క్రమంలో తుది చర్చల కోసం తుల ఉమ ఇంటికి వినోద్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ పార్టి వేములవాడ అభ్యర్థి లక్ష్మీనరసింహరావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సొంతగూటికి తుల ఉమ.. నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.. మంత్రి కేటీఆర్ పిలుపుతో నిర్ణయం..?
byJanavisiontv
-
0