హైదరాబాద్ : నేషనల్ పోలీస్ అకాడమీలో నూతన ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు..
అలాగే గవర్నర్ తమిళ సై, డీజీపీ అంజనీ కుమార్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ఐపీఎస్‌ల నుంచి అమిత్ షా గౌరవ వందనం స్వీకరించారు.
కాగా.. నేషనల్ పోలీస్ అకాడమీలో 175 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇండియన్ ట్రైనీ ఐపీఎస్ లు 155, మరో 20 మంది ఫారిన్ ఆఫీసర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 102 వారాలు పాటు శిక్షణ పూర్తి చేయాల్సి ఉండగా.. అందులో ట్రైనీలు మొదటి దశ పూర్తి చేసుకున్నారు. 75 మంది ఉన్న ఐపీఎస్ బ్యాచ్ లో 34 మంది మహిళ ట్రైనీ ఐపీఎస్‌లు ఉన్నారు. వారిలో 32 మంది ఇండియన్ ట్రైనీలు కాగా.. ఇద్దరు విదేశీయులు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 14 మంది ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించడం జరిగింది. తెలంగాణకు 9 మంది, ఏపీకి ఐదుగురు ఐపీఎస్‌లను కేటాయించడం జరిగింది. తెలంగాణకు ముగ్గురు మహిళ ఐపీఎస్‌లు, ఏపీకి ఒక మహిళ ఐపీఎస్‌ను కేటాయించారు. 155 మందిలో 102 మంది ట్రైనీ ఐపీఎస్‌లు ఇంజనీరింగ్ బ్యాగ్రౌండ్ కలిగిన వారు కావడం విశేషం. 25 ఏళ్ళ లోపు కలిగిన ట్రైనీ లు 9 మంది ఉన్నారు.