వంద నిమిషాల్లోనే... పరిష్కారం
వేగంగా చర్యలు తీసుకుంటాం : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల 29, అక్టోబర్ 2023
అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగస్తోంది.
ఎన్నికల వేళ జరిగే అక్రమాలను పౌరులు ఎప్పటికప్పుడు సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా కూడా ఆ ఘటనలను ఈయాప్‌ద్వారా తెలియజేయవచ్చు. ఆయా పార్టీల అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు వంటి వివరాలను నేరుగా ‘సీ-విజిల్’ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే లౌడ్‌స్పీకర్లు వాడినా, మతాలు, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పర్మిషన్ లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
ఈ యాప్‌ను గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న అక్రమాలను పొందుపరచవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే పది లక్షల మంది పౌరులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులపై పది నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు అక్కడికి వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ చర్యల ద్వారా ప్రజల్లో, వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని ఎన్నికల కమిషన్ భావిస్తున్నది.
వంద నిమిషాల్లోనే... పరిష్కారం
స్మార్ట్‌ఫోన్‌లో గుగూల్ ప్లే స్టోర్ నుంచి సీ-విజిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో వివరానుల నమోదు చేసుకోవాలి. ఎక్కడైతే ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందో దానికి సంబంధించిన ఫొటో లేదా వీడియో తీసి దాన్ని యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో నాయకులతో కూడిన ఫ్లెక్సీలు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజాప్రతినిధుల ఫొటోలు, ఇలాంటి కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే వాటిని యాప్‌లో ఒక్క క్లిక్‌తో అప్‌లోడ్ చేయొచ్చు. సీ-విజిల్ యాప్‌లో అప్‌లోడ్ చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం వెంటనే పరిశీలిస్తుంది. వంద నిమిషాల్లోనే చర్యలకు పూనుకుంటుంది. యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్ నంబర్లను ఈసీ గోప్యంగా ఉంచుతుంది.
వేగంగా చర్యలు తీసుకుంటాం
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే విధానంపై ప్రజలకు, అధికార యంత్రాగం అవగాహన కల్పిస్తుంది. ఈ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకుంటాం. ఎన్నికల అక్రమాలపై సీ-విజిల్ యాప్‌తోపాటు 1950 టోలో ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు.
- అనురాగ్ జయంతి, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, రాజన్న సిరిసిల్ల