ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని ఆలయాల్లో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా డ్రెస్ కోడ్ ను మరో పుణ్యక్షేత్రంలో అమలు చేయనున్నామని ప్రకటించారు.
ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ నిర్వాహకులు భక్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులందరికీ డ్రెస్‌కోడ్‌ను అమలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆలయానికి వచ్చే భక్తులు డ్రెస్ కోడ్ ను అనుసరించి దుస్తులు ధరించాలని.. అటువంటి భక్తులు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించే వీలు ఉంటుందని, ఇందుకోసం భక్తులకు అవగాహన కల్పించనున్నారు.
జగన్నాథ ఆలయ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంతో జనవరి 1 నుండి ఆలయంలో పొట్టి దుస్తులు, చిరిగిన జీన్స్, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ వంటి దుస్తులు ధరించిన భక్తులు ఆలయంలో ప్రవేశించడం నిషేధం. భక్తులు ఇక నుంచి అటువంటి దుస్తులు ధరించి ఆలయంలోకి ప్రవేశించలేరు.
అయితే ఆలయంలో ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ.. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నామని జగన్నాథ ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
Tags
జాతీయం