రెండు రోజుల్లో పవర్లూమ్ కార్మికులకు 10% యారన్ సబ్సిడీ అందించాలి.. సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ డిమాండ్


Input Editor Dayanand Jana
సిరిసిల్ల,12 అక్టోబర్(జనవిజన్ న్యూస్):  సిరిసిల్ల పట్టణం బి.వై.నగర్ లోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ 2021 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీని అందించడంలో అధికారులు తీవ్రంగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

2020 సంవత్సరం బతుకమ్మ చీరల సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందించి దాదాపు 4 నెలలు గడుస్తున్న కూడా ఇప్పటివరకు 2021 సంవత్సరం ఏ ఒక్క కార్మికునికి సబ్సిడీ అందించలేదని 2021 సం!! బతుకమ్మ చీరలకు సంబంధించి కార్మికుల ఉత్పత్తి వివరాలను ఇప్పటికే యజమానుల నుండి అధికారులు తీసుకోవడం జరిగిందని సర్వే కూడా పూర్తి చేసి హైదరాబాద్ చేనేత, జౌళి శాఖ అధికారులకు పంపించడం జరిగిందన్నారు. అయినా కూడా కార్మికుల ఖాతాలలో సబ్సిడీ డబ్బులు ఇప్పటికీ ఎందుకు జమ చేయడం లేదని ప్రశ్నించారు.

కాలయాపన చేయకుండా సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందించాలని అక్టోబర్ 5వ తేదీన సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టిన సందర్భంగా రెండు మూడు రోజుల లోపే కార్మికులకు సబ్సిడీ డబ్బులు అందిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు సబ్సిడీ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ కాలేదన్నారు. ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో కార్మికులు సబ్సిడీ డబ్బులు వస్తాయో రావో అని పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారన్నారు.  మరో వారం పది రోజుల్లో బతుకమ్మ , దసరా పండుగలు ఉన్నందున కార్మికులకు సబ్సిడీ డబ్బులు వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని, లేకుంటే పండుగల పూట కార్మికులు వారి కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడుతుందని, అలాంటి పరిస్థితి రాకుండా కార్మికుల ఇబ్బందులను గుర్తించి ఇప్పటికైనా చేనేత, జౌళి శాఖ అధికారులు కాలయాపన చేయకుండా వెంటనే రెండు రోజుల వరకు సబ్సిడీ డబ్బులను కార్మికుల ఖాతాలలో జమ చేయాలన్నారు. లేకుంటే అక్టోబర్ 16 సోమవారం రోజున హైదరాబాద్ చేనేత జౌళి శాఖ కమిషనర్ ను సబ్సిడీ డబ్బులు గురించి కార్మికులతో కలిసి వెళ్లి కలుస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్, కార్యదర్శి గుండు రమేష్, సబ్బని చంద్రకాంత్, బెజుగం సురేష్, మోర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post