ఢిల్లీ మహిళల భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు


ఢిల్లీ మహిళల భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

షిష్టాచార్‌ స్క్వాడ్స్‌ నుంచి క్యాబ్‌ డ్రైవర్ల వెరిఫికేషన్‌ వరకు.. భద్రతా చర్యలు కఠినతరం


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, బాలికల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీ–NCR పరిధిలో నమోదైన అత్యాచార ఘటనల నేపథ్యంలో సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. నేరాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు నివారణ చర్యలే ముఖ్యమని స్పష్టం చేసింది.
జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ పోలీసులకు పలు కీలక సూచనలు చేసింది.

ప్రధాన ఆదేశాలు ఇవే..

బీట్‌ పెట్రోలింగ్‌ పెంచాలి:
పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్‌ సెంటర్లు, ఇతర సున్నిత ప్రాంతాల వద్ద పోలీసుల గస్తీని మరింత పెంచాలని కోర్టు ఆదేశించింది.

షిష్టాచార్‌ స్క్వాడ్స్‌ మరింత చురుగ్గా:
మహిళలను వేధించడం, ఈవ్‌ టీజింగ్‌, అసభ్య ప్రవర్తన వంటి ఘటనలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘షిష్టాచార్‌ స్క్వాడ్స్‌’ను సమర్థంగా వినియోగించాలని సూచించింది.

క్యాబ్‌ డ్రైవర్ల కఠిన తనిఖీలు:
ప్రజా రవాణా, యాప్‌ ఆధారిత క్యాబ్‌ల డ్రైవర్లు, సహాయకుల వివరాలను కచ్చితంగా వెరిఫై చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

SOS, GPS వ్యవస్థలపై రియల్‌టైమ్‌ పర్యవేక్షణ:
వాహనాల ట్రాకింగ్‌, SOS వ్యవస్థలు కేవలం ఏర్పాటు చేయడం కాకుండా వాటిని నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.

CCTVలకు నిరంతర పర్యవేక్షణ:
కెమెరాలు ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదని.. వాటిని నిరంతరం పర్యవేక్షించే కమాండ్‌ సెంటర్లు, వార్‌ రూమ్‌ల పనితీరుపై దృష్టి పెట్టాలని కోర్టు పేర్కొంది.

చీకటి ప్రాంతాలు, వీధి దీపాలపై దృష్టి:
స్ట్రీట్‌లైట్లు పనిచేయకపోవడం, చీకటి ప్రాంతాలు, నేరాలకు అవకాశం కల్పించే ప్రదేశాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అక్రమంగా నడుస్తున్న తినుబండారాలపై చర్యలు:
అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్న అక్రమ తినుబండారాలు, ఇతర ప్రమాదకర ప్రదేశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోర్టు సూచించింది.
పోలీసు అధికారులే బాధ్యత వహించాలి
కోర్టు ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్‌ కమిషనర్‌ చర్యలపై క్రమం తప్పకుండా నివేదికలు సమర్పించాల్సి ఉంటుందని, ఆదేశాల అమలులో నిర్లక్ష్యం ఉంటే ఉన్నతాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.

అదే సమయంలో మహిళల భద్రత పేరుతో పోలీసులు అధికారం దుర్వినియోగం చేయకూడదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నివారణ చర్యలు చట్టబద్ధంగా, సముచితంగా, బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొంది.

మొత్తంగా.. ఢిల్లీలో మహిళలు, బాలికలకు రాత్రి వేళల్లోనూ భద్రత కల్పించేలా పోలీసింగ్‌ వ్యవస్థను మరింత చురుగ్గా మార్చడం, ప్రజా రవాణాలో భద్రతను పెంచడం, CCTV–SOS వ్యవస్థలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించడం, నేరాలను ముందుగానే అడ్డుకోవడమే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

జనవిజన్ టీవీ | JanaVision TV

Post a Comment

Previous Post Next Post