రాజన్నసిరిసిల్ల, 27 ఆగస్టు 2025: భారీ వర్షాలకు ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చడంతో మానేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ మానరు ప్రాజెక్ట్ సమీప గ్రామం నర్మల కు చెందిన పలువురు పశువుల కాపరులు గేదెలను మేపడానికి అవతలి వైపు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నారు. వారు వెళ్లిన కొంతసేపటికే ఎగువన కురిసిన భారీ వర్షాల ప్రభావంతో మానేరు మత్తడి అధిక ప్రవాహంతో పొంగిపొర్లడంతో వెనక్కి తిరిగి రావడం పశువుల కాపరులకు సాధ్యపడలేదు. ఇంతలోనే ఓ పశువుల కాపరి వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు.
ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద వ్యక్తి గల్లంతు..
మానేరు క్యాంపుకు చెందిన రైతు పంపు కాడి నాగం గల్లంతయినట్లు సమాచారం. ఇంకా ఐదుగురు పశువుల కాపరులు వాగు అవుతలి గడ్డ వద్ద చిక్కుకున్నారు. జంగం స్వామి, పిట్ల నర్సింలు, ధ్యానబోయిన స్వామి, పిట్ల మహేష్, పిట్ల స్వామి, రైతులు చిక్కుకున్నారు.
హెలికాప్టర్ ద్వారా సహాయం కోసం మంత్రి పొన్నంతో మాట్లాడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వరద ప్రవాహంలో చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడటం కష్టంగా మారడంతో హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షితంగా ఇవతలి గడ్డకు తరలించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఆపదలో చిక్కుకున్న, గల్లంతైన రైతుల కుటుంబాలతో మాట్లాడారు. ఆపదలో చిక్కుకున్న పశువుల కాపరులతో ఫోన్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో అధికారులు మాట్లాడి పరిస్థితిని వివరించారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఆపదలో చిక్కుకున్న రైతులతో మాట్లాడి, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో వారిని మాట్లాడించారు. వాతావరణం అనుకూలించిన వెంటనే సహాయ చర్యల కోసం హెలికాప్టర్ను పంపించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆపదలో ఉన్న రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తను ఆపదలో చిక్కుకున్న వారిని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో మంత్రులు, ప్రజా ప్రతినిధులంతా సహాయక చర్యలు నిమగ్నమయ్యారని తెలిపారు. వరద ప్రవాహంలో చిక్కుకున్న వారికి డ్రోన్ ద్వారా జిల్లా కలెక్టర్ సూచనలతో అధికారులు ఆహార పదార్థాలను పంపించారు.