మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేత

సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి సెస్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. నోటీసులు జారీ చేసినా బకాయి చెల్లించకపోవడంతో శుక్రవారం పవర్ కట్ చేశారు. దాంతో అంధకారంలోనే మున్సిపల్ అధికారులు, సిబ్బంది కార్యకలాపాలు నిర్వహించాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో మున్సిపల్ ఉద్యోగులు కంప్యూటర్, ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోలేకపోయారు. కాగా ఇప్పటికే సెస్ కు సిరిసిల్ల మున్సిపల్ సుమారు 4.6 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు సెస్ అధికారులు తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో, ఈ ఏడాది జనవరి నెల మొదట్లో మున్సిపల్ కార్యాలయానికి బకాయిలు చెల్లించాలని సెస్ అధికారులు నోటీసులు పంపించినట్లు తెలిసింది. అయినా సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విద్యుత్ సేవలను నిలిపివేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సెస్ ఎండి విజయెందర్ రెడ్డి మాట్లాడుతూ . . . సెస్ సంస్థ కూడా మా సరఫరాదారుకు డబ్బులు చెల్లించవలసి ఉందని అన్నారు. తమ సిబ్బందికి జీతాలు, మెయింటెనెన్స్ లు నెలనెలా చెల్లించాల్సి ఉంటుందన్నారు. నెలనెలా విద్యుత్ చార్జీలు చెల్లించినట్లైతేనే వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించగలమని తెలిపారు. బకాయిల కోసం మిగితా ప్రభుత్వ కార్యాలయాలను కూడా అడుగుతున్నామని, వారి స్పందనను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Post a Comment

Previous Post Next Post