నేతన్నలు చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చింది : కార్మిక సంఘాల జేఏసీ
కార్మిక సంఘాల పోరాటాన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయానికి వాడుకోవద్దని అన్నారు వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ నాయకులు.
మంగళవారం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ సమావేశంలో జేఏసీ కన్వీనర్లు ముశం రమేష్, పంతం రవి మాట్లాడుతూ.. గత నెల 15 రోజుల నుంచి వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం నివారణ కొరకు వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్లందరికీ ఉపాధి కల్పించాలని పోరాటాలు నిర్వహించి జేఏసీ ఏర్పాటు చేసి అనేక పోరాటాల సందర్భంగా ప్రభుత్వం స్పందించి వస్త్ర పరిశ్రమలో సమస్యలను పరిష్కరిస్తామని కార్మికులకు, ఆసాములకు 365 రోజులు చేతినిండా పని కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. బతుకమ్మ చీరల బకాయిలతో పాటు కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ, కరెంట్ సబ్సిడీ, అమలవుతున్న అన్ని పథకాలను అమలు చేస్తామని జేఏసీ సభ్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డిల సమక్షంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.
నేతన్నలు చేసిన పోరాటాన్ని కొంతమంది తమ స్వార్ధ రాజకీయాల కోసం పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దీక్ష చేస్తున్నానని ప్రకటించడం వలనే ప్రభుత్వం స్పందించిందని, కార్మికులు పోరాడి సాధించిన విజయాన్ని తన విజయంగా చెప్పుకోవడం ఎంపి బండి సంజయ్ కి సిగ్గుచేటని అన్నారు. ఇది నేతన్నల పోరాటాన్ని అవమాన పరిచయడమేనని అన్నారు. నేతన్నలకు ఉన్న జాతీయ చేనేత బోర్డు, జాతీయ టెక్స్టైల్ బోర్డు, మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన, ఐసిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య భీమా, హౌస్ కం వర్క్ షీట్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దుచేసి వస్త్ర పరిశ్రమపై 12 శాతం జీఎస్టీని కేంద్ర బిజెపి ప్రభుత్వం విధిస్తే ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నడు వస్త్ర పరిశ్రమ గురించి కార్మికుల సమస్యలపై మాట్లాడకుండా గత రెండు నెలలుగా నేతన్నలు చేస్తున్న పోరాటంలో ఎక్కడ కనిపించని బండి సంజయ్ ఎన్నికల్లో నేతన్నల ఓట్ల కోసం దీక్ష చేస్తానని ప్రకటించారే తప్ప నేతన్నలపై ప్రేమతో కాదని అన్నారు. పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కి నిజంగా వస్త్ర పరిశ్రమలు పనిచేస్తున్న కార్మికులపై ప్రేమ ఉంటే పదేళ్ల క్రితం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేసిన ఈఎస్ఐ హాస్పిటల్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఈఎస్ఐ హాస్పిటల్ గూర్చి పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేదని ధ్వజమెత్తారు. ఈఎస్ఐ హాస్పిటల్ గనుక సిరిసిల్లలో ఉంటే లక్షలాదిమంది బీడీ కార్మికులకు, ప్రతి ఒక్క కుటుంబానికి వైద్యం చేయించుకునే అవకాశం ఏర్పడుతుండెదని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల సమస్యల పట్టించుకోని బండి సంజయ్ కి ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు.
ఈ సమావేశంలో జెఎసి సభ్యులు మండల సత్యం, వెల్లండి దేవదాస్, తాటిపాముల దామోదర్, కట్టెకోల లక్ష్మీనారాయణ, కోడం రమన, సిరిసిల్ల రవి, పిస్కమధు, యేల్దండి శంకర్, గోనె పర్షరాములు, సిరిమల్ల సత్యం, నక్క దేవదాస్, గుండు రమేష్ తదితరులు పాల్గొన్నారు